ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeతెలంగాణకేయూ ను పట్టించుకునే నాధుడేలేడు.

కేయూ ను పట్టించుకునే నాధుడేలేడు.

📰 Generate e-Paper Clip

కామన్ మెస్‌లో పట్టపగలే కిరాణా సరకుల తరలింపు..?

• వీడియో వైరల్.. కేయూలో మరో వివాదం ..

• అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

విశాలజ్యోతి:

కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్‌లో మరో వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. కామన్ మెస్ స్టోర్‌రూమ్ నుంచి కిరాణా సరకులు బయటకు తీసుకువచ్చి ద్విచక్ర వాహనంపై తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతూ క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. వేసవి సెలవుల అనంతరం ఇటీవలే కామన్ మెస్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వైరల్ అవుతున్న వీడియోలో కామన్ మెస్‌కు చెందిన కేర్‌టేకర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది కనిపిస్తున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. స్టోర్‌రూమ్ నుంచి ఒక బ్యాగ్‌ను బయటకు తీసుకువచ్చి, ముందుగానే సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ పలు ఆరోపణలు: 

స్క్రాప్‌కు పంపాల్సిన నూనె డబ్బాలు, ఇనుప సామగ్రి విక్రయించబడినట్లు, ఆ డబ్బులతో విందులు నిర్వహించారనే వార్తలు ఇటీవలే చర్చనీయాంశంగా మారాయి. ఆ ఘటనపై వివాదం సద్దుమణగకముందే ఇప్పుడు కిరాణా సరకుల తరలింపు ఆరోపణలు బయటకు రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సమాచారం ప్రకారం, కామన్ మెస్ నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలపై గతంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత కేర్‌టేకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే ఒకవైపు షోకాజ్ నోటీసులు కొనసాగుతుండగా, మరోవైపు వరుసగా కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..?

“మెస్ సామగ్రి అక్రమ తరలింపు, స్క్రాప్ వ్యవహారాలు, వరుస ఆరోపణలు ఒకదాని వెంట ఒకటి బయటపడుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు కనిపించడం లేదు. దీంతో అక్రమాలకు ప్రోత్సాహం లభిస్తున్నదనే భావన విద్యార్థుల్లో ఏర్పడుతోంది” అని విద్యార్థి సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. వైరల్ వీడియోపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలికితీసి, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

యూనివర్సిటీ పరువు మసకబారుతుంది:

కాకతీయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో వరుసగా ఇలాంటి వివాదాలు చోటుచేసుకోవడం సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!