• రాకపోకల వాహనాలకు అసౌకర్యం
• ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది..?
• ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఇటు వైపు దృష్టి ఏది..?
భద్రాద్రి కొత్తగూడెం, విశాలజ్యోతి
అసలే ఇక్కడ ఇరుకు రోడ్డు.. ఆపై రోడ్డు మధ్యలో డివైడర్.. ఇరువైపులా రహదారి పక్కనే అడ్డదిడ్డంగా పార్కింగ్.. ఇక రాకపోకలు సాగించే వారి ఇబ్బందికర బాధ వర్ణాతీతం.. ఏకంగా జాతీయ రహదారిని పార్కింగ్ అడ్డాగా మార్చేసి గ్రాండ్ గా “కారు పార్కింగ్” చేస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఈ పార్కింగ్ దృశ్యం ట్రాఫిక్ వింగుకు కనిపించడం లేదా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.. ద్విచక్ర వాహనదారుల నెంబర్ ప్లేట్ల ఫోటోలు తీసి చలాన్లు విధించే ట్రాఫిక్ బృందానికి.. ఈ జాతీయ రహదారిపై పార్కింగ్ కనిపించడం లేదా..? అని ప్రజలు అసహన వ్యక్తపరుస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి సింగరేణి ప్రధాన కార్యాలయం మీదగా విజయవాడకు వెళ్లే జాతీయ రహదారినే పార్కింగ్ అడ్డాగా మార్చేశారు. ఇలా ఎవరు మార్చారంటే ట్రాఫిక్ పోలీసులే తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. సెయింట్ మేరీ హై స్కూల్ ఎదురుగా గల ప్రధాన రహదారిపై అప్పుడప్పుడు “కారు” పార్కింగ్ దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో ఒక ఫంక్షన్ హాల్ ఉండడంవల్ల అందులో జరిగే శుభకార్యాలకు వచ్చేవారు కార్లలో వస్తుంటారు. కార్ల యజమానులు రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి గంటల తరబడి శుభకార్యాలలో ఉండటంవల్ల ఇక్కడ పార్కింగ్ చేసిన కార్లతో ఇతరులకు ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ ఇబ్బందికర దృశ్యాలు ట్రాఫిక్ పోలీస్ బృందానికి కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏమైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని జనం గర్జిస్తున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత హడావుడి చేసేది ఏం లాభమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి గాయాలపాలై, ఎవరి ప్రాణాలు పోకముందే జాతీయ రహదారిపై “కార్ పార్కింగ్” చేయకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
