• ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో ప్రతి పదిలో 8 మందికి నో జాబ్స్
•ఎంబీయే చదివిన వారిలో ప్రతి నలుగురిలో ముగ్గురికి ప్లేస్‌మెంట్స్ శూన్యం
• దేశంలో ఇదీ నిరుద్యోగ దుస్థితి
విశాలజ్యోతి డెస్క్: దేశంలో నిరుద్యోగం అంతకంతకూ తీవ్రమవుతున్నది. ఉన్నత చదువులు చదివిన వారికి కూడా అర్హతకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. ఎంబీఏ విద్యార్థుల్లో కేవలం 26 శాతం మంది, ఇంజినీర్లలో కేవలం 15 శాతం మంది, పట్టభద్రుల్లో కేవలం 16 శాతం మంది మాత్రమే ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ‘అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. ఈ లెక్కన 70 నుంచి 85 శాతం మంది విద్యార్థులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నది. పట్టభద్రులు కానివారిలో 84శాతం మంది నిరుద్యోగులుగా ఉండగా, 17 శాతం మందికి నియమాలు ఆలస్యం కావడం లేదా చివరి నిమిషంలో రద్దు కావడం జరుగుతున్నదని తెలిపింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 150కిపైగా కంపెనీలు కాలేజీలకు వచ్చినప్పుడు 2.9 రెట్లు అధికంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, 30 కన్నా తక్కువ కంపెనీలు వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని ఆ నివేదిక వివరించింది. గత ఏడాదిలోపు పట్టభద్రులైన వారిలో మెజారిటీ విద్యార్థులు ఇంతవరకు ఉపాధిని పొందలేకపోయారని తెలిపింది. కంపెనీలు కొత్తవారిని చేర్చుకుంటున్నప్పటికీ ఆచితూచి ఎంపిక చేస్తున్నాయని తెలిపింది. అవకాశాలు కొన్ని క్యాంపస్‌లలో, నైపుణ్య సమూహాలలో, నియామక పద్ధతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయని వివరించింది.
గత అధ్యయనాల్లోనూ….
దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమేనని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంస్థ ఇటీవలి అధ్యయనంలో వెల్లడించింది. 50 శాతానికిపైగా పట్టభద్రులు క్లర్క్, మెషీన్ ఆపరేటర్ వంటి ఏడో తరగతి స్థాయి ఉద్యోగాలను చేస్తున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో తేలింది. దేశంలో 47 శాతం మందిలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొన్నది.