విశాలజ్యోతి డెస్క్: సీఎం సహాయనిధి పేదలకు ఓ వరం లాంటిదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ.6 లక్షల 33 వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతున్నదని తెలిపారు. అర్హులైన వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి అర్హుడూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ డా. కడియం కావ్య కోరారు.