VISHALAJYOTHI
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 1:53 am Posted by : DK MEDIA

భారీగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

22.6 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం.

• రూ.1.12 లక్షల విలువైన పీడీఎస్‌ బియ్యం సీజ్‌.. 

• బొలేరో వాహనం స్వాధీనం.

• డ్రైవర్‌తో పాటు నలుగురిపై కేసు నమోదు.

నందిపేట్‌, విశాలజ్యోతి : నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (పీడీఎస్‌) రేషన్‌ బియ్యాన్ని పోలీసులు, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22.60 క్వింటాళ్ల బియ్యాన్ని, దాని విలువ సుమారు రూ.1,12,548గా అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నందిపేట్‌ ఎస్‌ఐ కె. వినయ్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు రైతుఫామ్‌ గ్రామ శివారులో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల సమయంలో AP25X9971 నంబర్‌ గల మహీంద్రా బొలేరోను తనిఖీ చేయగా, వివిధ పరిమాణాల్లోని 48 ప్లాస్టిక్‌ సంచుల్లో రేషన్‌ బియ్యం గుర్తించారు.

కిలో రూ.18కు కొనుగోలు.. రూ.25కు విక్రయానికి

వాహనం డ్రైవర్‌ సయ్యద్‌ అన్సార్‌ (18) ను అదుపులోకి తీసుకుని విచారించగా, మాక్లూర్‌కు చెందిన ఛోటు పరిసర గ్రామాల ప్రజల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని కిలో రూ.18 చొప్పున సేకరించినట్లు, తాము ఛోటు వద్ద నుంచి కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో రూ.25కు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఎండి. మోసిన్‌, ఛోటు, బొలేరో యజమాని మహమ్మద్‌ తియాబ్‌ ఖురేషి కూడా భాగస్వాములుగా ఉన్నట్లు పేర్కొన్నారు.

బియ్యం మిల్లుకు తరలింపు

నందిపేట్‌ ఇన్‌చార్జి డిప్యూటీ తహశీల్దార్‌ (సివిల్‌ సప్లయ్స్‌) గింగురి వినోద్‌ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న 22.60 క్వింటాళ్ల బియ్యాన్ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ (సివిల్‌ సప్లయ్స్‌) తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు భద్రత కోసం శివశక్తి రైస్‌ మిల్‌కు అప్పగించి రసీదు పొందారు. బొలేరో వాహనాన్ని నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచారు.

ప్రభుత్వ రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, తరలించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతున్నాయని ఎస్‌ఐ కె. వినయ్‌ వెల్లడించారు.