• పాఠశాల విద్యలో విలీనం
• ముఖ్యమంత్రి నిర్ణయం..?
•విధివిధానాలపై కసరత్తు!
విశాలజ్యోతి డెస్క్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు 11, 12వ తరగతులకు స్వతంత్రంగా కొనసాగుతున్న ఇంటర్ బోర్డును రద్దు చేసి, దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ కీలక మార్పుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ దిశగా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అయితే, దీనికి సంబంధించి ఇంటర్ బోర్డుకు కూడా సమాచారం లేదు. ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలోనే ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు అకస్మాత్తుగా వాయిదా వేసినట్లు తెలిసింది.
7 రాష్ట్రాల్లోనే ఇంటర్ బోర్డులు..
1969-70 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న.. మాజీ ప్రధాని పివి.నరసింహారావు నేతృత్వంలోని కోఠారీ కమిషన్ సూచనల మేరకు ఇంటర్‌బోర్డు ఏర్పాటైంది. అప్పట్లో ఉన్న పీయూసీ, హెచ్‌యూసీ, ఎస్‌ఎ్‌సఎల్‌సీ వంటి విధానాలను రద్దు చేసి ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డును ప్రారంభించారు. అప్పటినుంచి 10వ తరగతి వరకు పాఠశాల విద్యగా, 11వ తరగతి నుంచి ఉన్నత విద్యగా పరిగణిస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం, కేరళ, మణిపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి 7 రాష్ట్రాల్లోనే ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డులున్నాయని, 10వ తరగతి, ఇంటర్ కోసం ప్రత్యేక బోర్డులు ప్రపంచంలో ఎక్కడా లేవని విద్యా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 12వ తరగతి వరకు పాఠశాల విద్యలో భాగంగా ఉంటే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యార్థుల ప్రయోజనం కోసమే.
‘ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఆషామాషీగా చేసింది కాదు. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశాం. ప్రపంచంలోని అన్ని దేశాలు 12వ తరగతి వరకు పాఠశాల విద్యగానే పరిగణిస్తున్నాయి. 12వరకు ఒకేచోట చదివితే విద్యార్థుల గురించి ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంటుంది. ఉపాధ్యాయుడు-విద్యార్థి మద్య బంధం పెరుగుతుంది. ఇవన్నీ విద్యార్థి జీవితానికి ఉపయోగపడే అంశాలే.’’
•ఆకునూరి మురళి, ఛైర్మన్- తెలంగాణ విద్యా కమిషన్